కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది.
రిజ్వాన్‌కు తోడుగా ఇఫ్తికర్ అహ్మద్(40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(3/65) మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్ మధుషాన్(2/58) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ, దునీత్ వెల్లలాగే(1/40) ఓ వికెట్ దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఫకార్ జమాన్(4)ను ప్రమోద్ మధుషాన్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్ మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్(52) సైతం ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కాస్త ఎదురు దాడికి దిగడంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
అనంతరం స్పిన్నర్లు రంగంలోకి దిగగా.. పాకిస్థాన్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. 64 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన బాబర్-షఫీఖ్ జోడీని స్పిన్ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే విడదీసాడు. బాబర్ ఆజామ్‌ను స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీతో జోరు కనబర్చిన అబ్దుల్లా షఫీక్‌ను పతీరణ ఔట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ హ్యారీస్(3) కూడా పతీరణనే రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. మహమ్మద్ నవాజ్(12)ను తీక్షణ ఔట్ చేశాడు. దాంతో పాకిస్థాన్ 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను ఆపేసారు. కాసేపటి తర్వాత మ్యాచ్ ప్రారంభమవ్వగా అంపైర్లు ఆటను 45 నుంచి 42 ఓవర్లకు కుదించారు.
వర్షం అనంతరం మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ పాకిస్థాన్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడీ సెట్ అయిన తర్వాత వేగంగా పరుగులు రాబట్టింది. బౌండరీలతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేసుకోగా.. ఇఫ్తికర్ అహ్మద్ అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. షాదాబ్ ఖాన్(1) విఫలమైనా.. రిజ్వాన్ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.