ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు జరుగుతున్న కీలక ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆతిథ్య పాకిస్థాన్ ఫైనల్ చేరింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అద్భుతం చేసింది. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా అద్భుత శతకాలతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా(96 బంతుల్లో 13 ఫోర్లతో 82), యువ ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్‌కీ(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 83), హెన్రీచ్ క్లాసెన్(56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో కైల్ వెర్రెయిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/66) రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, కుష్‌దిల్ షా తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం పాకిస్థాన్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 355 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(128 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్), సల్మాన్ అఘా(103 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 134 ) అజేయ శతకాలతో చెలరేగారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్(23), సౌద్ షకీల్(15)మరోసారి నిరాశపర్చగా.. ఫకార్ జమాన్(41) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్(2/79) రెండు వికెట్లు తీయగా.. కోర్బిన్ బోస్చ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో శుక్రవారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పాకిస్థాన్ సొంతగడ్డపై ముక్కోణపు వన్డే సిరీస్ ఆడింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 78 పరుగుల తేడాతో చిత్తయ్యింది. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 6 వికెట్ల తేడాతో ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. దాంతో సౌతాఫ్రికా-పాకిస్థాన్ క్లాష్ సెమీఫైనల్లా మారింది. ఇందులో గెలిచిన జట్టుకే ఫైనల్ చేరే అవకాశం ఉండటంతో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.