ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఆతిథ్య పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మెగా టోర్నీకి సన్నాహకంగా సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46), సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ(4/43) నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. మైకేల్ బ్రేస్‌వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసి గెలుపొందింది. డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డెవాన్ కాన్వే(74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సల్మాన్ అఘా తలో వికెట్ తీసారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఈ విజయం న్యూజిలాండ్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయగా.. పాకిస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సొంతగడ్డపై వన్డే సిరీస్ గెలవలేకపోయిన పాకిస్థాన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా రాణిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాబర్ ఆజామ్ పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతుంటే.. గాయంతో దూరమైన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ ఆడనుండగా.. ఫిబ్రవరి 23న దాయాదీ దేశాల మధ్య హై ఓల్టేజ్ పోరు జరగనుంది.