
కరాచీ: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. 440/6 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 612/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. కేన్ విలియమ్సన్(395 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్‌తో 200 నాటౌట్) డబుల్ సెంచరీ సాధించగా.. టామ్ లాథమ్(113) సెంచరీ బాదాడు. ఇష్ సోదీ(65) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ 5 వికెట్లు తీయగా.. నౌమన్ అలీకి మూడు వికెట్లు దక్కాయి. ఇక న్యూజిలాండ్‌కు 174 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
ఇంకా నాలుగు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టమే. అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల అలసత్వం మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాక్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కారణంగా న్యూజిలాండ్‌కు 5 పరుగులు పెనాల్టీ రూపంలో లభించాయి. వికెట్ల వెనుకాల లేజీగా ఉండే సర్ఫరాజ్.. బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా వెనుకాలే హెల్మెట్ పెట్టగా.. బంతి కాస్త దాన్ని తాకి బౌండరీవైపు దూసుకెళ్లింది.
అయితే నిబంధనల ప్రకారం బ్యాటర్ కొట్టిన బంతి ఫీల్డింగ్ ఆటగాళ్ల వస్తువులను తాకితే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ మ్యాచ్‌లో కూడా అంపైర్ అదే చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలసత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు పాకిస్థాన్ ఆటగాళ్లంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నౌమాన్ అలీ వేసిన 161వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని లెగ్ స్టంప్ దిశగా వేయగా.. సర్ఫరాజ్‌ను చేజారిన బంతి వెనకాల హెల్మెట్‌ను తాకి బౌండరీవైపు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజామ్(161), అఘా సల్మాన్(103) సెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్, మైకేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోదీ రెండేసి వికెట్లు తీసారు.