ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌ను పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటింగ్‌కు బౌలర్ల అసాధారణ ప్రదర్శన తోడవ్వడంతో న్యూజిలాండ్ ఘన విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(74 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. డారిల్ మిచెల్(84 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81), కేన్ విలియమ్సన్(89 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/88) మూడు వికెట్లు తీగాయ.. అబ్రర్ అహ్మద్(2/41) రెండు వికెట్లు పడగొట్టాడు. హ్యారీస్ రౌఫ్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం పాకిస్థాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఫకార్ జమాన్(69 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), సల్మాన్ అఘా(51 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(3), బాబర్ ఆజామ్(10) తీవ్రంగా నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లు తీయగా.. మైకేల్ బ్రేస్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లేన్ ఫిలిప్స్‌కు ఓ వికెట్ దక్కింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన గ్లేన్ ఫిలిప్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
పాకిస్థాన్ బౌలర్లు ధారళంగా పరుగులివ్వడం ఆ జట్టు ఓటమిని శాసించింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన గ్లేన్ ఫిలిప్స్ చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షాహిన్ షా అఫ్రిది వేసిన ఆఖరి ఓవర్‌లో ఫిలిప్స్ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 25 పరుగులు పిండుకున్నాడు. క్రీజులో సెట్ అవ్వడానికి టైమ్ తీసుకున్న గ్లేన్ ఫిలిప్స్.. తొలి 52 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌండరీల మోత మోగించిన అతను 22 బంతుల్లోనే 63 పరుగులు చేసి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్‌తో పాటు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. బౌలింగ్ చేసే సమయంలో హ్యారీస్ రౌఫ్ చీలమండ ట్విస్ట్ అవ్వడంతో అతను ఓవర్ మధ్యలోనే మైదానం వీడాడు. మళ్లీ బరిలోకి దిగలేదు. బ్యాటింగ్‌కు కూడా రాలేదు. అనంతరం ఫీల్డింగ్ చేస్తుండగా రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టే సమయంలో బంతి నేరుగా అతని ముక్కుకు తగిలింది. రక్త స్రావం కావడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ను సౌతాఫ్రికాతో సోమవారం ఆడనుంది.