ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 60 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. అనూహ్య ఓటమితో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ యంగ్(113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 107), టామ్ లాథమ్(104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. గ్లేన్ ఫిలిఫ్స్((39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/63), హ్యారీస్ రౌఫ్(2/80) రెండేసి వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

సెమీస్ ఆశలు సంక్లిష్టం..
అనంతరం పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కుష్దిల్ షా(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 69 ), బాబర్ ఆజామ్(90 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రూర్కీ(3/47), మిచెల్ సాంట్నర్(3/66) మూడేసి వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్, మైకేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీసారు. ఈ ఘోర పరాజయం పాకిస్థాన్ సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో పరాజయం.
బాబర్ ఆజామ్ జిడ్డు బ్యాటింగ్..
పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(4), మహమ్మద్ రిజ్వాన్(3), ఫకార్ జమాన్(24), తయ్యబ్ తహీర్(1), షాహిన్ షా అఫ్రిది(14) తీవ్రంగా నిరాశపర్చారు. బాబర్ ఆజామ్ జిడ్డు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ విజయవకాశాలను దెబ్బతీసాడు. క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా బాబర్ ఆజామ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయలేదు. ఆచితూచి ఆడిన అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాతే వేగంగా ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు.
బాబర్ జిడ్డూ బ్యాటింగ్‌తో మరో ఎండ్‌లో దూకుడుగా ఆడబోయి రిజ్వాన్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా వికెట్లు పారేసుకున్నారు. బాబర్ ఆజామ్ దూకుడుగా ఆడకున్నా కనీసం 100 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది. కానీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న బాబర్ ఆజామ్.. హాఫ్ సెంచరీ నమోదు చేయాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసినట్లు కనిపించింది.