పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయి అందుకున్న బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫకార్ జమాన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన బాబర్ ఆజామ్.. జాకోబ్ డఫ్ఫీ వేసిన ఏడో ఓవర్‌లో ఓవర్‌పిచ్‌డ్ డెలివరీని కవర్స్ వైపు ఆడి 6000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 123వ ఇన్నింగ్స్‌లోనే బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించి.. హషిమ్ ఆమ్లాను సమం చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. భారత మాజీ కెప్టెన్ 136 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగులు పూర్తి చేశాడు. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ 139 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. శిఖర్ ధావన్ 140 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

26 ఏళ్ల రికార్డ్ బద్దలు..
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 26 ఏళ్ల పాత రికార్డ్‌ను అధిగమించాడు. 1992 వరల్డ్ ఛాంపియన్స్‌లో పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ 150 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగుల చేసి ఆ దేశం తరఫున అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. తాజా బాబర్ ఆజామ్ అతన్ని అధిగమించాడు.
ఔటైన అసహనంతో..
బాబర్ ఆజామ్ ఇప్పటికే వన్డేల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. 2023లో 97 మ్యాచ్‌ల్లో అతను ఈ ఘనతను అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం బాబర్ ఆజామ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వామప్‌గా జరుగుతున్న తాజా సిరీస్‌లోనూ బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు. తాజా మ్యాచ్‌లోనూ 29 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఔటైన ఫ్రస్టేషన్‌లో బ్యాట్‌ను కిందపడేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కష్టాల్లో పాకిస్థాన్..
సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో 23 పరుగులే చేసిన బాబర్ ఆజామ్.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతని పేలవ ఫామ్ పాకిస్థాన్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(46), సల్మాన్ అఘా(45) నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించడంతో పాకిస్థాన్ 200 పరుగుల మార్క్‌ను ధాటగలిగింది.