ముల్తాన్: ఆసియాకప్ 2023 టోర్నీని పాకిస్థాన్ ఘనంగా ప్రారంభించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో నేపాల్ ముందు 343 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 151), ఇఫ్తికర్ అహ్మద్(71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ రెండు వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లామిచ్చనే తలో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఫకార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) దారుణంగా విఫలమయ్యారు. ఫకార్ జమాన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. ఇమామ్ ఉల్ హక్ రనౌటయ్యాడు. దాంతో పాకిస్థాన్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవ్వడంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ 2 వికెట్లకు 44 పరుగులే చేసింది. అనంతరం ఇదే తరహా బ్యాటింగ్ కొనసాగించిన ఈ జోడీ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసింది. కానీ మహమ్మద్ రిజ్వాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ అవ్వడంతో మూడో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చి అఘా సల్మాన్(5) విఫలమైనా.. ఇఫ్తికర్ అహ్మద్ సాయంతో బాబర్ ఆజామ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 72 బంతుల్లో బాబర్ ఆజామ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేపాల్ ఆటగాళ్లు వదిలేసారు. ఈ అవకాశంతో చెలరేగిన బాబర్ ఆజామ్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

ఇఫ్తికర్ అహ్మద్ సైతం ధాటిగా ఆడటంతో పాక్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ప్రతీ ఓవర్‌లో బంతిని బౌండరీకి తరలించారు. 108 బంతుల్లో బాబర్ ఆజామ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇఫ్తికర్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరూ నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ సిక్స్‌లతో పరుగుల విధ్వంసం సృష్టించారు. కరణ్ కేసీ వేసిన 49వ ఓవర్‌లో ఇఫ్తికర్ అహ్మద్ 4, 6, 4 బాది 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చివరి ఓవర్‌లో బాబర్ ఆజామ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన షాదాబ్ ఖాన్ 4 బాది క్లీన్ బౌల్డ్ అయ్యాడు.