పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సోమవారం ప్రారంభమైన టెస్ట్ సిరీస్‌లోనూ బాబర్ ఆజామ్ శుభారంభాన్ని అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై కూడా దారుణంగా విఫలమయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులే చేసి ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 4 వికెట్లకు 328 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్(177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(184 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) శతకాలతో రాణించారు.

క్రీజులో సౌద్ షకీల్(35 బ్యాటింగ్)తో పాటు నసీమ్ షా(0 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జాక్ లీచ్ తలో వికెట్ పడగొట్టారు.
శుభారంభం లేకున్నా..
ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(4) దారుణంగా విఫలమయ్యాడు. అట్కిన్సన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన షాన్ మసూద్‌తో మరో ఓపెనర్ అబ్దుల్లా ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఈ ఇద్దరూ ఓపికగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. వేగంగా ఆడిన షాన్ మసూద్ 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అబ్దుల్లా షఫీక్ 77 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో పాకిస్థాన్ 122/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్ వెళ్లింది.
షాన్ మసూద్, అబ్దుల్లా శతకం..
సెకండ్ సెషన్‌లో ఈ జోడీ అదే జోరును కొనసాగించింది. భారీ సిక్స్‌లు బాదిన షాన్ మసూద్ 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకోగా.. అబ్దుల్లా ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. 233/1 స్కోర్‌తో పాకిస్థాన్ టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్ ఆరంభంలోనే అబ్దుల్లా 165 బంతుల్లో శతకం పూర్తి చేసుకోగా.. షాన్ మసూద్ 166 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని అట్కిన్సన్ విడదీసాడు. అబ్దుల్లాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి రెండో వికెట్‌కు నమోదైన 253 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న షాన్ మసూద్‌ను జాక్ లీచ్ రిటర్న్ క్యాచ్‌తో బోల్తా కొట్టించాడు. బాబార్ ఆజామ్(30) విఫలమవ్వగా.. పాక్ మేనేజ్‌మెంట్ నసీమ్ షాను నైట్ వైచ్‌మన్‌గా పంపించింది.