పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ జరుగుతున్న తీరుపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం సిద్దం చేసిన పిచ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్‌కు పనికి రాదని అభిప్రాయపడుతున్నారు. బ్యాట్, బంతి మధ్య సమతూకమైన పోటీ ఉంటేనే అసలు సిసలు మజా వస్తుందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఫ్లాట్ పిచ్‌లతో వచ్చే లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 556 పరుగులు చేసింది. ముగ్గురు పాకిస్థాన్ బ్యాటర్లు శతకాలు నమోదు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. ఇప్పటికే జోరూట్ శతకం పూర్తి చేసుకొని డబుల్ సెంచరీ దిశగా సాగుతుండగా.. హ్యారీ బ్రూక్ సెంచరీకి చేరువయ్యాడు. జాక్ క్రాలీ(78), బెన్ డక్కెట్(84) తృటిలో శతకాలను చేజార్చుకున్నారు.

అయితే ఈ వికెట్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ అసహనం వ్యక్తం చేశాడు. డెయిలీ మెయిల్‌కు రాసిన కథనంలో పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ వికెట్‌పై స్పిన్, స్వింగ్, రివర్స్ సింగ్ ఏది లేదని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఫ్లాట్‌గా ఉందని పేర్కొన్నాడు. ఇంత చెత్త పిచ్‌ను తాను ఎక్కడ చూడలేదని, పాకిస్థాన్‌లో కూడా ఇప్పటివరకు ఇలాంటి వికెట్ కనిపించలేదని విమర్శలు గుప్పించాడు. టెస్ట్ క్రికెట్ మనుగడకు ఇలాంటి పిచ్‌లు ఏ మాత్రం అయోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డాడు.
'టెస్ట్ క్రికెట్ మనుగడకు ఈ పిచ్ ఏ మాత్రం సరికాదు. ఇలా ఐదో రోజులు ఆడినా సుదీర్ఘ ఫార్మాట్‌కు ఒరిగే ప్రయోజనం ఏం లేదు. ఈపిచ్ మరీ ఫ్లాట్‌గా ఉంది. టెస్ట్ క్రికెట్‌ను బతికించాలంటే సరైన పిచ్‌లను సిద్దం చేయాలి. రెండు రోజులుగా ఈ వికెట్‌పై ఎలాంటి మార్పు లేదు. స్పిన్, స్వింగ్, రివర్స్ సింగ్ ఏదీ లేదు. ఇది మరీ బ్యాటర్లకు అనుకూలంగా ఉంది.
బ్యాట్, బంతి మధ్య సరైన పోటీ ఉంటేనే టెస్ట్ క్రికెట్ బతుకుతోంది. అలాంటి వికెట్స్‌ను తయారు చేయడంపై ఐసీసీ ఫోకస్ పెట్టాలి. 600, 500, 400 పరుగులు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. చివరి మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. స్టేడియం మొత్తం ఖాళీగా ఉంది. ఇలానే ఐదు రోజుల పాటు మ్యాచ్ జరిగితే ఎవరూ కూడా రారు.
ఈ మ్యాచ్‌లో ఫలితం రావాలంటే పిచ్ పగుళ్లు పడేవరకు ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయాలి. పాకిస్థాన్ స్కోర్‌కు సమీపంగా వచ్చి మూడో ఇన్నింగ్స్ ఆడించాలి. పగుళ్లు పడిన వికెట్‌పై స్పిన్ రాబట్టవచ్చు. ఈ పగుళ్లను అడ్వాంటేజ్‌గా మార్చుకొని పాక్‌ను ఆలౌట్ చేయాలి. ఆ తర్వాత ధాటిగా ఆడి లక్ష్యాన్ని అందుకోవాలి. 'అని నాజర్ హుస్సేన్ తన కథనంలో రాసుకొచ్చాడు.