
ముల్తాన్: సొంతగడ్డపై పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. సుమారు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అసాధారణ ఆట తీరుతో చారిత్రాత్మక విజయాన్నందుకుంది.
355 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్థాన్ 328 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(213 బంతుల్లో 8 ఫోర్లతో 94) చేసిన ఒంటరి పోరాటం సరిపోలేదు. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్(4/65) నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
198/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాటర్ ఫహీమ్ అష్రఫ్ వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నవాజ్(62 బంతుల్లో 7 ఫోర్లతో 45)తో కలిసి సౌద్ షకీల్ పోరాడాడు. 6వ వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మార్క్ వుడ్ విడదీసాడు. వరుస ఓవర్లలో నవాజ్, షకీల్‌ను ఔట్ చేసి పాక్ పతనాన్ని శాసించాడు.
ఈ ఇద్దరు ఔటైనా అఘ సల్మాన్(20 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. అబ్రర్ అహ్మద్(17) కూడా సహకరించడంతో పాక్ సంచలన విజయాన్నందుకుంటుందా? అని అంతా భావించారు. కానీ వుడ్, రాబిన్సన్ ఆ అవకావం ఇవ్వకుండా చెలరేగారు. మహమ్మద్ అలీ(0)ని రాబిన్సన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ విజయ లాంఛనం పూర్తయ్యింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 281 ఆలౌట్
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 275 ఆలౌట్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 328 ఆలౌట్