బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా చేసిన తప్పిదమే తమ ఘోర పరాజయానికి కారణమని పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ అన్నాడు. మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లోనూ పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పటికే తొలి టెస్ట్‌లో ఓడిన పాకిస్థాన్.. తాజా పరాజయంతో 0-2తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది.
అసాధారణ ప్రదర్శనతో వరుసగా రెండు టెస్ట్‌లు గెలిచిన బంగ్లాదేశ్ పాకిస్థాన్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ ఆ జట్టును లిటన్ దాస్(138), మెహ్‌దీ హసన్ మీరాజ్(78) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించారు.

పాత కథే రిపీట్..
ఈ భాగస్వామ్యమే మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పిందని పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్ట్ పరాజయం అనంతరం మాట్లాడిన షాన్ మసూద్.. ఇప్పటికైనా ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నాడు. 'ఈ పరాజయం తీవ్రంగా నిరాశపర్చింది. హోమ్ సీజన్ కోసం మేం చాలా ఉత్సాహంగా ఎదురు చూసాం. కానీ ఆస్ట్రేలియా తరహా కథనే పునరావృతమైంది.
మా వైఫ్యలాల నుంచి మేం పాఠాలు నేర్చుకోలేకపోయాం. ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగైన క్రికెట్ ఆడాలనే విషయాన్ని తెలుసుకున్నాం. కానీ సొంతగడ్డపై మా బాధ్యతను నిర్వర్తించలేకపోయాం. ఈ విషయంపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. నా సారథ్యంలో ఇలా జరగడం ఇది నాలుగోసారి. టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్లు మరింత ఫిట్‌నెస్‌తో ఉండటం ముఖ్యం.
ఆ తప్పిదమే..
తొలి టెస్ట్‌లో మేం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాం. ఎందుకంటే బౌలర్ల వర్క్‌లోడ్ ఈజీ అవుతుందని భావించాం. తాజా టెస్ట్‌లో ఆ విషయం నిరూపితమైంది కూడా. ప్రతీ ఇన్నింగ్స్‌లో మాకు ఓ పేసర్ తక్కువయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మేం సాధించిన 274 పరుగుల స్కోర్ మంచిదే. నేను, సయీమ్ .. లిటన్ దాస్ తరహాలో మరిన్ని పరుగులు చేయాల్సింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 26/6 కట్టడి చేసిన తర్వాత వచ్చిన భాగస్వామ్యాన్ని అడ్డుకోవాల్సింది.
ఈ విషయంలో మేం వర్క్ చేయాల్సి ఉంది. అన్ని రోజులు ఇలానే ఉండవు. మేం షాహిన్, నసీమ్ షాల సేవలను తిరిగిపొందాం. గతేడాదిగా మూడు ఫార్మాట్లలో షాహిన్ అఫ్రిది నిలకడగా రాణిస్తున్నాడు. అలా అని అతని ఒక్కడిపైనే భారం వేయలేం. మేం మరింత ఫిట్‌గా.. మెరుగ్గా సిద్దం కావాల్సిన అవసరం ఉంది.'అని షాన్ మసూద్ చెప్పుకొచ్చాడు.
మలుపు తిప్పిన లిటన్ దాస్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయుబ్(110 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), షాన్ మసూద్(69 బంతుల్లో 2 ఫోర్లతో 57), సల్మాన్ అఘా(95 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. మెహ్‌దీ హసన్(5/61) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. లిటన్ దాస్(138) సెంచరీతో.. మెహ్‌దీ హసన్ మీరాజ్(78) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు.
పాకిస్థాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహ్‌జాద్(6/90) ఆరు వికెట్లు తీయగా.. మిర్ హంజా, సల్మాన్ అఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది.