లాహోర్: ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్లు నిప్పులు చెరిగారు. హ్యారీస్ రౌఫ్(4/19) చార్‌మార్ బౌలింగ్‌కు నసీమ్ షా(3/34) తీన్మార్ తోడవ్వడంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది.
కెప్టెన్ షకీబ్ అల్ హసన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 53), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(87 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 19 పరుగుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ చివరి 5 వికెట్లను కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్‌కు తోడుగా షాహిన్ అఫ్రిది, ఫాహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ మెహ్‌దీ హసన్ మీరాజ్(0)ను నసీమ్ షా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీతో మెహ్‌దీ హసన్‌ను బోల్తా కొట్టించాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెహ్‌దీ హసన్.. ఈ మ్యాచ్‌లో నసీమ్ షా ధాటికి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన లిటన్ ధాస్ బౌండరీలతో పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. కానీ అతని జోరుకు షాహిన్ అఫ్రిది అడ్డుకట్టవేసాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆచితూచి ఆడుతున్న మహమ్మద్ నైమ్(20)ను హ్యారీస్ రౌఫ్ పెవిలియన్ చేర్చాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి రిట్నర్ క్యాచ్‌గా వెనక్కి పంపించాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్‌లో టౌహిడ్ హృదయ్(2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ను షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ క్రమంలో 55 బంతుల్లో షకీబ్ అల్ హసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 100 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఫహీమ్ అష్రఫ్ విడదీసాడు.
క్రీజులోకి వచ్చిన షమీమ్ హోస్సెన్(16) సాయంతో ముష్ఫికర్ రహీమ్ 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే షమీమ్(16)ను ఇఫ్తికర్ అహ్మద్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ధాటిగా ఆడుతున్న ముష్ఫికర్ రహీమ్(64)ను హారీస్ రౌఫ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన టస్కిన్ అహ్మద్(0), షోరిఫుల్ ఇస్లామ్(1) వరుసగా పెవిలియన్ బాట పట్టారు.