పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు సత్తా చాటారు.
వికెట్ల కోసం బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. 316/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పికర్ రహీమ్(341 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్‌తో 191) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. లిటన్ దాస్(56), మెహ్‌దీ హసన్ మీరాజ్(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, ఖుర్రమ్ షెహ్‌జాద్, మహమ్మద్ అలీ రెండేసి వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు. సయీమ్ ఆయుబ్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ షాన్ మసూద్(9 బ్యాటింగ్)తో పాటు ఆబ్దుల్లా షఫీక్(12 బ్యాటింగ్) ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 448/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మహమ్మద్ రిజ్వాన్(171), సౌద్ షకీల్(141) భారీ శతకాలతో రాణించారు. పాకిస్థాన్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా విజయం సాధించాలంటే.. పాకిస్థాన్‌ను త్వరగా ఆలౌట్ చేయాలి. లేకుంటే మ్యాచ్ ఫలితం తేలకుండా ముగుస్తోంది.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 ఆలౌట్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 23/1