లాహోర్: ఆసియాకప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ తమ జోరును కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన సూపర్-4 పోరులోనూ సమష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్(4/19), నసీమ్ షా(3/34) బంగ్లా పతనాన్ని శాసించగా.. షాహిన్ అఫ్రిది, ఫాహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 53), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(87 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది.

ఇమామ్ ఉల్ హక్(84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78), మహమ్మద్ రిజ్వాన్(79 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. లక్ష్యచేధనలో పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు.
ఫకార్ జమాన్(20)ను షోరిఫుల్ ఇస్లామ్ వికెట్ల ముందు బోల్తాకొట్టించడంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 37 పరుగులే చేసింది. ఆ కొద్దిసేపటికే బాబర్ ఆజామ్(17)ను టస్కిన్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 74 పరుగులకే పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి మరో ఓపెనర్ ఫకార్ జమాన్(84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78) జట్టును ఆదుకున్నాడు.
మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించిన అనంతరం అతన్ని మెహ్‌దీ హసన్ మీరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన అఘా సల్మాన్(12 నాటౌట్) సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిజ్వాన్.. జట్టు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన హ్యారీస్ రౌఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం భారత్‌తో ఆడనుంది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.