లాహోర్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో బాబర్ ఆజామ్(22 బంతుల్లో ఫోర్‌తో 17)దారుణంగా విఫలమయ్యాడు. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో బాబర్ ఆజామ్ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదే టోర్నీలో పసికూన నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్(151) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. తాజా సూపర్ 4 మ్యాచ్‌లో బాబర్ విఫలమవడంతో 'పసికూనలపైనేనా నీ ప్రతాపం'అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

బలమైన జట్లపై బాబర్ ఆజామ్ రాణించిన సందర్భాలు చాలా అరుదని, ముఖ్యంగా ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లో ఆడలేడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. బ్యాటింగ్‌కు కాస్త ప్రతికూలంగా ఉన్న పిచ్‌లపై కూడా బాబర్ ఆజామ్ రాణించలేడని గణంకాలతో సహా వివరిస్తున్నారు. పసికూన జట్లపై పులిలా చెలరేగే బాబర్ ఆజామ్.. బలమైన జట్లతో మాత్రం పిల్లిలా విఫలమవుతున్నాడని మండిపడుతున్నారు.
జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, అఫ్గానిస్థాన్ వంటి బలహీనమైన జట్లపైనే బాబర్ సెంచరీల మోత మోగిస్తాడని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లపై రాణించిన సందర్భాలు చాలా తక్కువని ట్రోల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్(4/19), నసీమ్ షా(3/34) బంగ్లా పతనాన్ని శాసించగా.. షాహిన్ అఫ్రిది, ఫాహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 53), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(87 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ ఆదిలోనే బాబర్ ఆజామ్, షకార్ జామ్(20) వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి మరో ఓపెనర్ ఫకార్ జమాన్(84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78) జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు.