పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ తృటిలో డబుల్ సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మహమ్మద్ రిజ్వాన్ 171 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్.. తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 కు డిక్లేర్ చేశాడు. దాంతో కెరీర్‌లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించలేకపోయాడు.
మరో 29 పరుగులు చేసుంటే మహమ్మద్ రిజ్వాన్ డబుల్ సెంచరీ పూర్తయ్యేది. రిజ్వాన్ డబుల్ సెంచరీ పూర్తవ్వకముందే డిక్లేర్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే రిజ్వాన్ డబుల్ సెంచరీ అడ్డుకున్నారని నెటిజన్లు పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్‌పై విమర్శలు గుప్పించారు.

అయితే మహమ్మద్ రిజ్వాన్ ఇచ్చిన సలహా ప్రకారమే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశామని, ఇందులో కెప్టెన్ షాన్ మసూద్ తప్పేం లేదని ఆ జట్టు వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ స్పష్టం చేశాడు. జట్టు స్కోర్ 450 పరుగులకు చేరగానే డిక్లేర్ చేయాలని రిజ్వాన్ తనకు సూచించాడని తెలిపాడు. మహమ్మద్ రిజ్వాన్ డబుల్ సెంచరీ చేయకపోవడంపై అతనేం బాధపడటం లేదన్నాడు. జట్టు క్షేమం కోరే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
'మాకు ఎవరికీ మహమ్మద్ రిజ్వాన్ భాయ్ డబుల్ సెంచరీ చేజారిందనే బాధ లేదు. మహమ్మద్ రిజ్వాన్ కూడా అలా బాధపడటం లేదు. ఇన్నింగ్స్ డిక్లేర్ నిర్ణయంలో ఎలాంటి తొందరపాటు పడలేదు. ఇన్నింగ్స్‌ను నిలిపివేసే గంట ముందు డిక్లేర్ చేయాలని మహమ్మద్ రిజ్వానే సూచించాడు. జట్టు 450 పరుగుల వద్దకు చేరగానే డిక్లేర్ చేయాలని చెప్పాడు. చివరి గంటలో బంగ్లాదేశ్ వికెట్లు తీయాలనే ఆలోచనతో డిక్లేర్ నిర్ణయం తీసుకున్నాం.'అని షకీల్ చెప్పుకొచ్చాడు.
మహమ్మద్ రిజ్వాన్‌తో పాటు సౌద్ షకీల్(141) శతకంతో రాణించగా.. సైమ్ ఆయుబ్(56) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సౌద్ షకీల్, రిజ్వాన్ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 240 పరుగులు జోడించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ముగిసే సమయానికి 92 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(55 బ్యాటింగ్), లిటన్ దాస్(52 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ షెడ్‌మన్ ఇస్లామ్(93), మోమినల్ హక్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహ్‌జాద్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ అలీ, సయీమ్ ఆయుబ్ ఓ వికెట్ పడగొట్టాడు.