బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ ఓటమి ముంగిట నిలిచింది. 185 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు జకీర్ హసన్(31 బ్యాటింగ్), షెడ్‌మన్ ఇస్లామ్(9 బ్యాటింగ్) ఉన్నారు. బ్యాడ్ లైట్ కారణంగా నాలుగో రోజు ఆటను కాస్త ముందుగానే అంపైర్లు ఆపేసారు.
బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 143 పరుగులు కావాలి. అద్భుతం జరిగితే తప్పా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి నుంచి గట్టెక్కలేదు. ఇప్పటికే తొలి టెస్ట్‌లో చారిత్రాత్మక విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచిన బంగ్లాదేశ్.. మరో విజయానికి చేరువలో ఉంది. రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయుబ్(110 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), షాన్ మసూద్(69 బంతుల్లో 2 ఫోర్లతో 57), సల్మాన్ అఘా(95 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. మెహ్‌దీ హసన్(5/61) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. లిటన్ దాస్(138) సెంచరీతో.. మెహ్‌దీ హసన్ మీరాజ్(78) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు.
ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును అసాధారణ బ్యాటింగ్‌తో లిటన్ దాస్ ఆదుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహ్‌జాద్(6/90) ఆరు వికెట్లు తీయగా.. మిర్ హంజా, సల్మాన్ అఘా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం 12 స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 172 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), సల్మాన్ అఘా(47 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హసన్ మహముద్(5/43) ఐదు వికెట్లు తీయగా.. నహిద్ రాణా(4/44) నాలుగు వికెట్లు పడగొట్టాడు. టస్కిన్ అహ్మద్ ఓ వికెట్ తీసాడు.