ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు పాకిస్థాన్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో సమష్టిగా చెలరేగిన పాకిస్థాన్ 111 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది.
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 96 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్ నవాజ్(5/18) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. షాహీన్ షా అఫ్రిది(2/16) రెండు వికెట్లు తీసాడు. అబ్రర్ అహ్మద్, నసీమ్ షా తలో వికెట్ తీసారు. ఆసీస్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్(22), మార్కస్ స్టోయినీస్(23), జోష్ ఫిలిప్పే(14) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అంతకుముందు పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. సైమ్ ఆయుబ్(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), బాబర్ ఆజామ్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. షాదాబ్ ఖాన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 46) దూకుడుగా ఆడారు.

ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా బాబర్ ఆజామ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. బాబర్ ఆజామ్ ఇప్పటి వరకు 39 అర్థ శతకాలు సాధించగా.. విరాట్ కోహ్లీ 38 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
1 బాబర్ అజామ్(పాకిస్థాన్)- 132 ఇన్నింగ్స్‌ల్లో 39 హాఫ్ సెంచరీలు
2 విరాట్ కోహ్లీ(భారత్)- 117 ఇన్నింగ్స్‌ల్లో 38 హాఫ్ సెంచరీలు
3 రోహిత్ శర్మ (భారత్)- 151 ఇన్నింగ్స్‌ల్లో 32 హాఫ్ సెంచరీలు
4 మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)- 93 ఇన్నింగ్స్‌ల్లో 30 హాఫ్ సెంచరీలు
5 డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 110 ఇన్నింగ్స్‌ల్లో 28 హాఫ్ సెంచరీలు