హంబంటోట: అఫ్గానిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది.
పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్(151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 151) సెంచరీతో చెలరేగగా.. ఇబ్రహిమ్ జడ్రాన్(101 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఉసామా మిర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(105 బంతుల్లో 4 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. బాబర్ ఆజామ్(66 బంతుల్లో 6 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో షాదాబ్ ఖాన్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 48), నసీమ్ షా(5 బంతుల్లో 2 ఫోర్లతో 18) విలువైన పరుగులు చేశారు.
అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ మూడు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, అబ్దుల్ రెహ్మాన్ తలో వికెట్ తీసారు. మహమ్మద్ నబీకి రెండు వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో నసీమ్ షా బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ఓటమి తప్పించుకుంది. చివరి ఓవర్ పాక్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతి వేసేముందు క్రీజును ధాటిన షాదాబ్ ఖాన్‌ను ఫజలక్ ఫరూఖీ రనౌట్ చేశాడు.
బంతి వేయకముందే షాదాబ్ ఖాన్ క్రీజు ధాటడంతో అంపైర్లు ఔటిచ్చారు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అఫ్గాన్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ తొలి బంతిని బౌండరీ బాదిన నసీమ్ షా ఆశలు రేకెత్తించాడు. రెండో బంతి డాట్ బాల్ కాగా.. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మూడో బంతికి సింగిల్ రాగా.. నాలుగో బంతికి హ్యారీస్ రౌఫ్ మూడు పరుగులు చేశాడు.
చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో నసీమ్ షా బౌండరీ బాది సంచలన విజయాన్ని అందించాడు. 11 పరుగులు డిఫెండ్ చేయడంలో ఫరూఖీ విఫలమవ్వడం అఫ్గాన్ కొంపముంచింది.