హంబంటోట: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 151) విధ్వంసకర సెంచరీ చెలరేగడంతో పాకిస్థాన్ ముందు అఫ్గానిస్థాన్ 301 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్ సెంచరీకి తోడుగా ఇబ్రహిమ్ జడ్రాన్(101 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఉసామా మిర్ తలో వికెట్ తీసారు.

అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహిమ్ జడ్రాన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పాక్ పేస్ త్రయం షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీ రౌఫ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ.. ఓపికగా బ్యాటింగ్ చేసింది. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా అఫ్గాన్ 48 పరుగులు చేసింది.
అనంతరం అదే జోరును కొనసాగించిన అఫ్గాన్ ఓపెనర్లు.. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 72 బంతుల్లో రెహ్మానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే ఇబ్రహీం జడ్రాన్ 71 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఈ జోడీని విడదీసేందుకు పాక్ పేసర్లు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు.

నిలకడగా ఆడిన రెహ్మానుల్లా గుర్బాజ్ 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన ఇబ్రహిమ్ జడ్రాన్‌ను ఉసామా మిర్ ఔట్ చేసి ఈ జోడీని విడదీసాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 227 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీతో కలిసి గుర్బాజ్ ధాటిగా ఆడాడు.
150 పరుగులు పూర్తి చేసుకున్న అతన్ని షాహిన్ షా అఫ్రిది కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నంలో వరుసగా పెవిలియన్ చేరారు. ఇదే వికెట్‌పై జరిగిన తొలి వన్డేలో పాక్ పేస్ త్రయం ధాటికి 59 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవి చూసిన అఫ్గాన్.. రెండో వన్డేలో భారీ స్కోర్ నమోదు చేయడం గమనార్హం.