కొలంబో: ఆసియాకప్ 2023 టోర్నీ ముందు శ్రీలంక గడ్డపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో బాబర్ ఆజామ్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
అతనికి తోడుగా వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్(79 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 67) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్లకు 268 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అఘా సల్మాన్(38 నాటౌట్), మహమ్మద్ నవాజ్(30) విలువైన పరుగులు చేశాడు.

అఫ్గాన్ బౌలర్లలో గులబాదిన్ నైబ్ రెండు, ఫరీద్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. ఫజలక్ ఫరూఖీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఫకార్ జమాన్(27)ను గుల్బాదిన్ నైబ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు ఆత్మరక్షణగా ఆడారు. దాంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది.

పవర్ ప్లే అనంతరం ఇమామ్ ఉల్ హక్(13)ను గుల్బాదిన్ నైబ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బాబార్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ ఆచితూచి ఆడారు. ఓపికగా బ్యాటింగ్ చేస్తూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే బాబర్ ఆజామ్ 77 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీసాడు. బాబర్ ఆజామ్(60)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్(9), షాదాబ్ ఖాన్(3) విఫలమవ్వగా.. అఘా సల్మాన్, మహమ్మద్ నవాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు.