టీ20ల్లోనే కనీ వినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. ఓ జట్టు 20 ఓవర్లను స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించడం చర్చనీయాంశమైంది. సౌతాఫ్రికా20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ ఈ ఫీట్ సాధించింది.
దాంతో ఫ్రాంచైజీ టీ20 క్రికెట్ చరిత్రలోనే 20 ఓవర్లను స్పిన్నర్లతో వేయించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ ఈ ఫీట్ సాధించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశమైంది. స్పిన్నర్లతో బౌలింగ్ చేయించినా.. పార్ల్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. జో రూట్(56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ డేవిడ్ మిల్లర్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రిటోరియా బౌలర్లలో విల్ జాక్స్, బోస్చ్, ముతుసామి, సిమ్మండ్స్ తలో వికెట్ తీసారు.
అనంతరం ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులే చేసి ఓటమిపాలైంది. విల్ జాక్స్(53 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. పార్ల్ రాయల్స్ జో రూట్, పీటర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, దునిత్ వెల్లలెగ, ఫర్చ్యూన్ స్పిన్నర్లతో 20 ఓవర్లు బౌలింగ్ చేయించింది.
జోరూట్, ముజీబ్, ఫర్చూన్ తలో రెండు వికెట్లు తీయగా.. దునిత్ ఓ వికెట్ పడగొట్టాడు. పార్ల్ రాయల్స్‌కు ఇది 6వ విజయం. ఈ జట్టులో టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆడుతున్నాడు. దాంతోనే ఈ జట్టుకు భారత్‌లో క్రేజ్ నెలకొంది.