
హైదరాబాద్: చిన్నా చితక కార్పోరేషన్లలోనే కాదు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లోనూ అవినీతి, దుబార ఖర్చు రాజ్యం ఏలుతోంది. తాజాగా ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా బోర్డు దుబారా ఖర్చు ప్రపంచానికి తెలిసింది. ఈ లెక్కలను చూసి యావత్ భారత్ నవ్వుకుంటుంది. గతేడాది జపాన్ వేదికగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు ప్రోత్సహకాలను ప్రకటించింది. అయితే ఈ క్యాష్ రివార్డులను ఇచ్చేందుకు బోర్డు భారీ మొత్తంలో ఖర్చు చేయడం ఇప్పుడు అందర్నీ విస్మయపరుస్తోంది. రూ.4 కోట్ల క్యాష్ రివార్డులు ఇచ్చేందుకు బీసీసీఐ ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు చేసింది.
ఈ లెక్కలకు సంబంధించిన కథనాన్ని ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్ ప్రచురించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌తో పాటు భారత్‌కు మొత్తం 7 పతకాలు లభించాయి. ఈ మెడల్స్ సాధించిన ఏడుగురికి బీసీసీఐ నగదు ప్రోత్సహకాలు అందజేసింది. రూ. 4 కోట్లు ఇచ్చిన బీసీసీఐ మొత్తం రూ.18 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపించింది.
ఈ ఆర్బాటాలలో భాగంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్‌కు రూ. 70 లక్షలను ఖర్చు చేసిన బోర్డు.. ఒలింపిక్స్ మార్కెటింగ్ క్యాంప్‌నకు రూ. 90 లక్షలు వెచ్చించిందట. ఇవేగాక టోక్యో ఒలింపిక్స్ ప్రమోషన్స్ కోసం ఓ కమర్షియల్ కంపెనీకి రూ. 7 కోట్లు కట్టబెట్టిన బీసీసీఐ.. పీఎం కేర్స్ మొమెంటోల కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపెట్టిందని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తన కథనంలో పేర్కొంది.
వాస్తవానికైతే బీసీసీఐ.. భారత ఒలింపిక్ సంఘానికి (ఐవోఏ) రూ. 10 కోట్ల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ పతక విజేతలకు ఇచ్చింది రూ. 4 కోట్లు మాత్రమే. మరి ఈ లెక్కల్లో బొక్కల గురించి బీసీసీఐ బాసులు, ట్రెజరీలే సమాధానం చెప్పాలని క్రీడా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సాయం చేయాల్సి వస్తే ఆటగాళ్లకు నేరుగా సాయం చేయాలిగానీ ఈ హంగులు, ఆర్భాటాలు ఎందుకని నిలదీస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ తీరు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. బీసీసీఐ బిల్లులను చూసిన నెటిజన్లు కార్పోరేషన్ల బిల్లుల్లా ఉన్నాయని సెటైర్లు పేల్చుతున్నారు. కార్పోరేషన్లలో సానిటేషన్ ఖర్చులు కూడా ఇలానే ఉంటాయని కామెంట్ చేస్తున్నారు.