
హైదరాబాద్: బిగ్ బాష్ లీగ్ 2020-21 సీజన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సంప్రదాయక నిబంధనలు సడలించిన బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు మూడు మార్పులు చేశారు. పవర్ సర్జ్, ఎక్స్-ఫ్యాక్టర్, బాష్ బూస్ట్.. అనే మూడు ఆసక్తికర నూతన నిబంధనలను తీసుకువచ్చారు. అయితే వీటిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
రనౌట్ కోసం ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెత్త ఐడియా ఇచ్చిందెవరని మండిపడుతున్నారు. అసలు ఈ రూల్స్ ఏ మాత్రం అర్థం కావడం లేదని, అలాంటిది ఎలా ఉత్సాహ పరుస్తాయని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే.. బ్యాట్స్‌మెన్‌ను సొంత అంపైర్లు తెచ్చుకొని ఆడమనండి, వెయ్యిపరుగులు చేయమనండని మండిపడుతున్నారు. ఈ చెత్త నిర్ణయాలతో క్రికెట్ ప్రతిష్టను దిగజార్చవద్దని చురకలంటిస్తున్నారు.
ఇక బీబీఎల్ నిర్వాహకులు తెచ్చిన కొత్త రూల్స్ లో పవర్ సర్జ్ ప్రకారం 6 ఓవర్ల పవర్ ప్లేను 4 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ చేసే జట్టు తనకి నచ్చిన సమయంలో మిగిలిన రెండు ఓవర్లను పవర్‌ప్లేగా మార్చుకోవచ్చు. సూపర్ సబ్‌స్టిట్యూట్‌ను తుది జట్టులోకి తీసుకురావడమే ఎక్స్-ఫ్యాక్టర్. 10 ఓవర్లు పూర్తైన సమయంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చు. అయితే ఎవరి స్థానంలో ఎక్స్ ఫ్యాక్టర్ జట్టులోకి వస్తున్నాడో.. అతను ఓవర్‌కు మించి బ్యాటింగ్/బౌలింగ్ చేయకూడదు. బాష్ బూస్ట్ ప్రకారం.. ప్రతీ విజయానికి జట్టుకు మూడు పాయింట్లు కేటాయిస్తారు. పది ఓవర్లలోపే ప్రత్యర్థిని చిత్తు చేస్తే అదనంగా మరోపాయింట్ దక్కుతుంది. 10 ఓవర్లకు స్కోరు సమమైతే 0.5 పాయింట్ వస్తుంది.
అయితే ఈ నిబంధనలు ఏమాత్రం ఆహ్వానించదగినవి కావని అభిమానులు తేల్చేస్తున్నారు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని లీగ్‌పై గందరగోళం నెలకుండా పెద్ద పెద్ద ఆటగాళ్లు పాల్గొనేలా చూడాలని హితవు పలుకుతున్నారు.