టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు కట్టేందుకు ఎంతో కష్టపడుతున్నానని సాయం చేయాలని ఓ విద్యార్థి రిషభ్ పంత్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌వేదికగా పోస్ట్ పెట్టాడు. దీనికి స్పందించిన రిషభ్ పంత్.. సదరు విద్యార్థికి 90 వేల రూపాయలు సాయం చేశాడు. దాంతో పంత్ పేరు ఎక్స్‌వేదికగా మారుమోగింది. శభాష్ పంత్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించాడు. కాసేపటికే రిషభ్ పంత్ ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లిస్తానని సదరు విద్యార్థి ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కార్తీకేయ మౌర్య అనే విద్యార్థి తన ఎక్స్ ఖాతాలో కెట్టో లింక్‌ను షేర్ చేసి రిషభ్ పంత్‌ను సాయం కోరాడు. 'హలో నేను కార్తీకేయ మౌర్య. చండీగఢ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాను. నా కుటుంబంపై ఆధారపడకుండా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువు కొనసాగిస్తున్నా. గత కొన్ని నెలలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను. దాంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మీ సాయం నా జీవితాన్ని మార్చగలదు'అని పంత్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌కు స్పందించిన పంత్.. సదరు విద్యార్థికి సాయం చేశాడు. 'మీ కలలను నేరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండండి. దేవుడు మీ కోసం మంచి ప్రణాళికలు సిద్ధం చేసే ఉంటాడు'అని పంత్ రీ పోస్ట్ చేశాడు.
అయితే సదరు విద్యార్థిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. రిషభ్ పంత్‌ను మోసం చేయడానికి సిగ్గు లేదా? అని ట్రోల్ చేశారు. దీనికి స్పందించిన సదరు విద్యార్థి.. 'ఇంత ద్వేషాన్ని భరించలేను. కెట్టోలో రిఫండ్ చేసే అవకాశం లేదు. వాళ్లకు మెయిల్ చేశాను. అనుమతి రాగానే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తాను. క్షమించండి'అని పోస్ట్ పెట్టాడు. ఆ విద్యార్థికి సంబంధించిన అసలు గుర్తింపు తెలపలేదు. అయితే ఇది ఓ స్కామ్ అని తెలుస్తోంది. సదరు ట్విటర్ యూజర్ గతంలో కూడా ఇలా డబ్బులు అడిగాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.