హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి నేటికి నాలుగేళ్లు. 2019లో సరిగ్గా ఇదే రోజు(జూలై 10)న ధోనీ తన చివరి ఇన్నింగ్స్ ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌట్‌గా వెనుదిరిగాడు. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ ఒంటరి పోరాటం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జడేజా, బుమ్రా, హార్దిక్ పాండ్యా, చాహల్ తలో వికెట్ తీసారు. 240 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ వర్షం కారణంగా పరిస్థితులన్నీ మారిపోయాయి.

గంటలకొద్దీ కవర్లు కప్పి ఉంచడం.. మరుసటి రోజు టీమిండియా బ్యాటింగ్ చేయాల్సిరావడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చింది. మబ్బులు కమ్మిన మైదానంలో స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న కండిషన్స్‌పై కివీస్ పేసర్లు చెలరేగారు. దాంతో స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్.. కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1)ల వికెట్లను వరుసగా కోల్పోయింది.
ట్రెంట్ బౌల్ట్ ధాటికి 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దినేశ్ కార్తీక్(6) కూడా ఔటవ్వడంతో టీమిండియా కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో రిషభ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. న్యూజిలాండ్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించిన ధోనీ.. విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు.
విజయానికి 32 పరుగులు దూరంలో జడేజా ఔటైనా.. ధోనీ గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ భారత విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ అనూహ్యంగా రనౌటయ్యాడు. స్ట్రైకింగ్ ఉంచుకోవాలనే ఆలోచనతో క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో ధోనీ ఔటయ్యాడు. మార్టిన్ గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రో.. ధోనీ బ్యాట్ క్రీజు ధాటడానికి అరసెకను ముందు వికెట్లను గీరాటేసింది.
ఈ సమయంలో ధోనీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. లెగ్ అంపైర్ సైతం ఈ రనౌట్ కాకపోయి ఉంటే బాగుండు అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అసాధారణ ఆటతీరుతో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా.. చివరకు సెమీస్‌లో ఓడి ఇంటిదారిపట్టింది.
ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ.. 2020 ఆగస్టు 15న ఆటకు వీడ్కోలు పలికాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అదేందో కానీ రనౌట్‌తోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన ధోనీ రనౌట్‌తోనే ముగింపు పలికాడు.