హైదరాబాద్: టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రికెట్ చరిత్రలోనే అసాధ్యమనుకునే రికార్డును సుసాధ్యం చేశాడు.
16 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు.

2007 సెప్టెంబర్ 19వ తేదీన డర్బన్ వేదికగా ఇంగ్లండ్, భారత్ తలపడ్డాయి. నాకౌట్ చేరాలంటే టీమిండియాకు అది తప్పక గెలవాల్సిన మ్యాచ్. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నారు. అప్పటికి భారత్ స్కోర్ మూడు వికెట్లకు 171 పరుగులు. ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అనంతరం 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్ ఊతప్ప(6) ఔటవ్వడంతో కెప్టెన్ ధోనీ (10), యువరాజ్ ((58) క్రీజులోకి వచ్చారు. చివరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించగా.. యువరాజ్ ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు.

ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆండ్రూ ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదాడు. దీంతో యువీపై ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆ కోపం తర్వాత ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో చూపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్.. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
ఆ తర్వాత ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ప్లింటాఫ్.. ఓ సిక్స్ బాదిన అనంతరం యువీని ఔట్ చేశాడు. మొత్తంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ధోని సేన 200 పరుగులకే కట్టడి చేయడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని నేతృత్వంలోని టీమిండియా తొలి ఐసీసీ వరల్డ్ టీ20 విజేతగా నిలిచింది.
2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్.. భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.