
హైదరాబాద్: ఆఫ్ స్పిన్నర్లు లెగ్‌బ్రేక్ బంతులు వేయడం బలహీనత కాదని దానిని బలంగా గుర్తించాలని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. టీ20ల్లో మణికట్టు స్పిన్నర్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఆఫ్‌స్పిన్ బౌలర్లకు మద్దతుగా సచిన్ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని చూస్తోన్న రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్లకు సచిన్ మాటలు ఊరట కలిగించేవే. మంగళవారం 45వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సచిన్ మీడియాతో మాట్లాడుతూ 'ఆఫ్ స్పిన్నర్లకు లెగ్ బ్రేక్ సాయపడుతుందని అనుకుంటున్నా. ఇది రెండు మూడు భాషలు నేర్చుకున్నట్టు లెక్క' అని అన్నారు.
'ఐదారు భాషాలు నేర్చుకున్నా తేడా ఏమీ ఉండదు. మన బౌలింగ్ శైలిలో తేడా ఏమీ ఉండదు. ఎక్కువ వైవిధ్యం ఉంటే ఫింగర్ స్పిన్నర్ల అమ్ముల పొదిలో ఎక్కువ ఆయుధాలు ఉన్నట్టే. ఆఫ్ స్పిన్నర్లు లెగ్ బ్రేక్స్ వేయలేరన్న జనాల ఆలోచనా దృక్పథం తప్పు. దానిని మార్చుకోవాలి. దూస్రా (గూగ్లీ) లాగే దాన్ని మరొక ఆయుధంగా భావించాలి' అని సచిన్ అన్నారు.
'ఈ కాలంలో లెగ్ స్పిన్నర్లు బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వారి బౌలింగ్‌పై ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకునేలా చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాడు మయాంక్ మార్కండే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు' అని సచిన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో షేన్‌వార్న్ బౌలింగ్‌ను అర్థం చేసుకునేందుకు ప్రత్యేకంగా కసరత్తు చేశారని సచిన్ ఈ సందర్భంగా తెలిపారు.