న్యూఢిల్లీ: భారత వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 12 వేదికలను బీసీసీఐ ఎంపిక చేయగా.. రెండింట్లో వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మిగతా 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన వేదికల విషయంపై రాజకీయ రంగు పులుముకుంది. ఉద్దేశపూర్వకంగా కొన్ని రాష్ట్రాల్లో స్టేడియాలకు బీసీసీఐ మ్యాచ్‌లు కేటాయించలేదని, ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రల పట్ల వివక్ష చూపించిందని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. పంజాబ్‌లోని మోహాలీ, కేరళలోని తిరువనంతపురం, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టేడియాలను ఎంపిక చేయకపోవడంపై ఆయా రాష్ట్రాల నేతలు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ అయితే బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్లు వైజాగ్, మోహాలీ స్టేడియాలు లేకపోవడంతోనే మ్యాచ్‌లు కేటాయించలేదని స్పష్టం చేశాడు. ఐసీసీ స్టాండర్డ్స్‌కు సరితూగకుంటే తాము ఏం చేయలేమని చెప్పాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 12 వేదికలను వార్మప్ సహా ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం సిద్ధం చేసినట్లు తెలిపాడు. 'ప్రపంచ కప్ కోసం తొలిసారి 12 వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గతంలో నిర్వహించిన ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికవ్వలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి.
మిగతావన్నీ లీగ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మరిన్ని వసతులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చింది. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్‌లు జరుగుతాయి.
మ్యాచ్‌లను కేటాయించే విషయంలో ఏ వేదికపైనా వివక్ష చూపలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను మొహాలీ వేదికగానే నిర్వహించాం. విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కూడా మొహాలీలోనే జరిగిందనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మొహాలీలోని మల్లాన్‌పుర్ స్టేడియం సిద్ధమవుతోంది. ఒకవేళ అది రెడీగా ఉండుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌కు వేదికయ్యేది.
ఇప్పుడున్న మైదానం ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా లేదు. అందుకే ఈసారి అవకాశం రాలేదు. వరల్డ్ కప్ కోసం మైదానాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకం. తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.'అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చాడు.
సౌత్ జోన్ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరవనంతపురం వేదికలను ఖారారు చేయడంతో వైజాగ్‌కు చోటు దక్కలేదు. హైదరాబాద్‌లోనూ టీమిండియా మ్యాచ్‌లు లేవు. దాంతో తెలుగు అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ వైజాగ్ స్టేడియానికి మొండిచెయ్యే ఎదురైంది.