న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ఈసారి భారీ ప్రైజ్‌మనీని కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం ప్రైజ్‌మనీని 10 మిలియన్ అమెరికా డాలర్లుగా ప్రకటించారు.
భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.83 కోట్లు(82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్లకు పంచనున్నారు.

ప్రపంచకప్ విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు(రూ.33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు రూ.16 కోట్ల 58 లక్షల 54 వేలు, సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు(రూ. కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు), గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలర్(రూ. 82 లక్షల 92 వేల 950), గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు(రూ.33 లక్షల 17 వేల 668) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు.
ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ ఇవ్వడం ఐసీసీ చరిత్రలో ఇదే తొలిసారి. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.