న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పెట్టిన కండిషన్స్‌కు భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-పాక్‌లు ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దగ్గరే ఉండగా.. అక్కడికి తమ జట్టును పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. అసలు పాక్‌లో ఆసియాకప్ నిర్వహించవద్దని డిమాండ్ చేస్తోంది. పాక్‌కు వెళ్లేందుకు తమ ప్రభుత్వం అనుమతివ్వదని చెబుతోంది. దాంతో భారత్ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహిస్తామని పీసీబీ ప్రతిపాధించింది.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా నిర్వహించి మిగతా మ్యాచ్‌లను పాక్‌లో ఆడిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనకు కూడా బీసీసీఐ అంగీకారం తెలుపడంలేదు. ఈ క్రమంలోనే టీమిండియా.. పాకిస్థాన్‌కు రాకుంటే తాము వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లమని పీసీబీ చాలా రోజులుగా బెదిరిస్తోంది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌కతా వేదికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.
అయితే ఈ డిమాండ్‌కు బీసీసీఐ ఒప్పుకోలేదని ఓ అధికారి తెలిపాడు. ఇదే విషయంపై ఐసీసీని రిక్వెస్ట్ చేసిన పీసీబీ మొండిచెయ్యే ఎదురైనట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించినట్లు ఓ అధికారి వెల్లడించాడు. ఈ ఏడాది అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. మొత్తం 12 వేదికలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఇందులో హైదరాబాద్ కూడా ఉంది. మెగా టోర్నీలో ప్రతి జట్టూ లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. ఆసియా కప్ ఆతిథ్యం విషయంలో తగ్గేదేలేదని పీసీబీ స్పష్టం చేసింది. తమ ప్రతిపాదనలకు భారత్ ఒప్పుకోకుంటే టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఆసియా కప్ ఆడకపోతే తాము 30 లక్షల డాలర్లు నష్టపోతామని పీసీబీ చైర్మన్ నజమ్ సేథి తెలిపాడు.
'ఆసియాకప్‌లో తన మ్యాచ్‌లను టీమిండియా విదేశాల్లో ఆడుతుంది. మిగతా మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుంది. ఇది మా ప్రతిపాదన. ఇలా కాకుండా మరే షెడ్యూలునూ మేం ఒప్పుకోం, టోర్నీలో ఆడం'' అని అన్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆదాయంలో 80 శాతం భారత్, పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుందని సేథి పేర్కొన్నాడు.