NZ vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(3/37), లాకీ ఫెర్గూసన్(2/35), మిచెల్ సాంట్నర్(2/22), రచిన్ రవీంద్ర(2/21) నిప్పులు చెరగడంతో లంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో ఆ జట్టు 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది.
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో మహీశ్ తీక్షణ(38 నాటౌట్), దిల్షన్ మధుషంక(19 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీకి ఓ వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సౌథీ వేసిన రెండో ఓవర్‌లో పాతుమ్ నిస్పంక(2) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ ఒకే ఓవర్‌లో కుశామ్ మెండీస్(6), సదీర సమరవిక్రమా(1)లను ఔట్ చేశాడు. ఆ కొద్ది సేపటికీ చరిత్ అసలంక(8)ను బౌల్ట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కుశాల్ పెరీరా(51)ను ఫెర్గూసన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో శ్రీలంక 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

పవర్ ప్లే అనంతరం మిచెల్ సాంట్నర్ సత్తా చాటడంతో ఏంజెలో మాథ్యూస్(16), ధనుంజయ డిసిల్వా(19) ఔటయ్యారు. గత మ్యాచ్‌లో టైమ్ ఔట్ అయ్యానని రచ్చ చేసిన మాథ్యూస్.. ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. చమిక కరుణరత్నే(6)ను ఫెర్గూసన్ దుష్మంత చమీరా(1)ను రచిన్ రవీంద్ర ఔట్ చేయగా.. దిల్షాన్ మధుషంక సాయంతో మహీష్ తీక్షణ ఒంటరి పోరాటం చేశాడు. చివరి వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. మధుషంకను రచిన్ ఔట్ చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.