ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని న్యూజిలాండ్ బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. ఆతిథ్య పాకిస్థాన్‌తో కరాచీ వేదికగా జరుగుతున్న ఆరంభ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ యంగ్(113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 107), టామ్ లాథమ్(104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. గ్లేన్ ఫిలిఫ్స్((39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/63), హ్యారీస్ రౌఫ్(2/80) రెండేసి వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆఖరి 10 ఓవర్లలోనే న్యూజిలాండ్ 113 పరుగులు చేయడం గమనార్హం. మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. అబ్రర్ అహ్మద్ ఒక వికెట్ తీయగా.. కుష్దీల్ షా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. హ్యారీస్ రౌఫ్ అయితే ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ బౌలర్ల వైఫల్యం న్యూజిలాండ్‌కు కలిసొచ్చింది.

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ డెవాన్ కాన్వే(10)ను స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే కేన్ విలియమ్సన్(1)ను నసీమ్ షా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి పవర్ ప్లేలోనే న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులే చేసింది. క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్(10)ను హ్యారీస్ రౌఫ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు ఆచితూచి ఆడిన విల్ యంగ్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
విల్ యంగ్ విధ్వంసం..
అతనికి జత కలిసిన టామ్ లాథమ్ పాక్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. ఈ ఇద్దరూ వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే విల్ యంగ్ 107 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే టామ్ లాథమ్ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం ధాటిగా ఆడే క్రమంలో విల్ యంగ్.. నసీమ్ షా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
టామ్ లాథమ్ సెంచరీ..
క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్‌తో కలిసి టామ్ లాథమ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలోనే టామ్ లాథమ్ 95 బంతుల్లో శతకాన్ని సాధించాడు. పాకిస్థాన్ బౌలర్లు స్లో ఓవర్ రేట్ కారణమయ్యారు. నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసారు. దాంతో నిబంధనల ప్రకారం చివరి రెండు ఓవర్ల పాటు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే పెట్టాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఈ రెండు ఓవర్లలో 24 పరుగులు సాధించారు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 125 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.