న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ ఓటమిపాలైంది. శుక్రవారం క్రిస్టన్‌చర్చ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. మహమ్మద్ నవాజ్(9 బంతుల్లో 3 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
బాబర్ ఆజామ్(19), ఫకార్ జమాన్(9), ఇఫ్తికర్ అహ్మద్(10) దారుణంగా విఫలమయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్), గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/34) ఒక్కడే మూడు వికెట్లు తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4తో కోల్పోయిన పాకిస్థాన్ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. షాహిన్ అఫ్రిది సారథ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాకిస్థాన్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వరుసగా 4 టీ20ల్లో ఓడి చెత్త రికార్డును మూటగట్టుకుంది. 159 పరుగుల లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్‌కు షాహిన్ అఫ్రిది దిమ్మతిరిగే షాకిచ్చాడు.
తొలి ఓవర్‌లోనే ఫిన్ అలెన్(8), టీమ్ సీఫెర్ట్(0)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ ఇద్దర్నీ క్యాచ్ ఔట్ చేసిన అఫ్రిది తన మరుసటి ఓవర్‌లో విల్ యంగ్(4)ను కూడా ఔట్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు.
నాలుగో వికెట్‌కు 139 పరుగుల అజేయ భాగస్వామ్యంతో అద్భుత విజయాన్ని అందించారు. 41 బంతుల్లో గ్లేన్ ఫిలిప్స్, 34 బంతుల్లో డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అఫ్రిదికి తోడుగా మరే బౌలర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోవడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.