న్యూజిలాండ్ పర్యటనను పాకిస్థాన్ విజయంతో ముగించింది. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ఐదు టీ20ల సిరీస్‌ను 4-1తో కివీస్‌కు కోల్పోయిన పాకిస్థాన్.. క్లీన్ స్వీప్ గండాన్ని గట్టెక్కింది. ఆదివారం ఉదయం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్(3/24) సంచలన బౌలింగ్‌తో పాకిస్థాన్ 42 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. పాకిస్థాన్ కెప్టెన్‌గా షాహిన్ అఫ్రిదికి ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(38 బంతుల్లో 4 ఫోర్లతో 38), ఫకార్ జమాన్(16 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 33) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోదీ రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 92 పరుగులకు కుప్పకూలింది. గ్లేన్ ఫిలిప్స్(22 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26), ఫిన్ అలెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) మినహా అంతా విఫలమయ్యారు. షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ నవాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. జమాన్ ఖాన్, ఉసామా మిర్ తలో వికెట్ తీసారు.
53/2తో లక్ష్యం దిశగా సాగిన న్యూజిలాండ్ ఇఫ్తికర్ అహ్మద్ దాటికి 39 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోయింది. స్వల్ప లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్‌కు రెండో ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ రచిన్ రవీంద్ర(1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన టీమ్ సీఫెర్ట్ నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా.. ఇఫ్తికర్ అహ్మద్ అతన్ని పెవిలియన్ చేర్చాడు. వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

తర్వాత విల్ యంగ్‌ను మహమ్మద నవాజ్ ఔట్ చేయగా.. మార్క్ చాప్‌మన్ రనౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో గ్లేన్ ఫిలిప్స్(26) ఒంటరి పోరాటం చేయగా.. అతనికి మరో ఎండ్‌లో సహకరం లభించలేదు. మిచెల్ సాంట్నర్(4), మ్యాట్ హెన్రీ(1), ఇష్ సోధీ(1), లాకీ ఫెర్గూసన్(0) వరుసగా పెవిలియన్ చేరారు.