టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా తమ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. సొంతగడ్డపై ఆడినా.. న్యూజిలాండ్ వేదికగా తలపడినా ఆస్ట్రేలియానే విజయాలు అందుకుంటోంది. ముఖ్యంగా 1993 నుంచి ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఓడించలేకపోతుంది. ఈ 31 ఏళ్లలో ఇరు జట్లు 28 సార్లు తలపడగా.. న్యూజిలాండ్ ఒకే ఒక విజయం సాధించింది.
ఆస్ట్రేలియా మాత్రం 25 విజయాలు నమోదు చేయగా.. 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. ఆ ఒక్క మ్యాచ్ కూడా 2011లో హోబర్ట్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌ను 172 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం నిలిచింది. ఈ రికార్డ్‌ను చూసి జనాలు అవాక్కవుతున్నారు.

అవాక్కవుతున్న ఫ్యాన్స్..:
వరల్డ్ బెస్ట్ టీమ్ అయిన న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియాపై టెస్ట్‌ల్లో ఇంత చెత్త రికార్డు ఉండటాన్ని నమ్మలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్.. గత 31 ఏళ్లుగా ఆస్ట్రేలియాను ఒకేసారి ఓడించడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కేన్ విలియమ్సన్ సారథ్యంలో కూడా న్యూజిలాండ్ ఓటమిపాలైందంటే నమ్మలేకపోతున్నామని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
గత 6 టెస్ట్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించడం మరో విశేషం.
చేజారిన అగ్రస్థానం..:
ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ 2025 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. 60 విజయాల శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. 64.58 విజయాల శాతంతో భారత్ అగ్రస్థానాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా 50, పాకిస్థాన్ 36.66 విజయాల శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చిత్తు చిత్తుగా..:
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(275 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. 176 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నాడు.
అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ(43) మినహా అంతా విఫలమయ్యారు. 184 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 164 పరుగులకే ఆలౌటైంది. గ్లేన్ ఫిలిప్స్(5/45) సంచలన ప్రదర్శన కనబర్చాడు.
369 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 196 పరుగులకు కుప్పకూలింది. రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 59), డారిల్ మిచెల్(130 బంతుల్లో 2 ఫోర్లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
టామ్ లాథమ్(8), విల్ యంగ్(15), కేన్ విలియమ్సన్(9), టామ్ బ్లండెల్(0), గ్లేన్ ఫిలిప్స్(1) దారుణంగా విఫలమయ్యారు. టేయిలెండర్ స్కాట్ కుగ్గెల్‌జిన్(26) పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 6 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్‌కు తలో వికెట్ దక్కింది. భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కామెరూన్ గ్రీన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది.