ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా నాథన్ లయన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా 128 టెస్ట్‌ల తన కెరీర్‌లో 521 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కోర్ట్‌నీ వాల్ష్(519) రికార్డును అధిగమించాడు.
న్యూజిలాండ్ బ్యాటర్ స్కాట్ కుగ్గెల్‌జిన్(0)ను ఔట్ చేయడం ద్వారా 520వ వికెట్ మైలు రాయిని అందుకున్న లయన్.. వాల్ష్‌ను వెనక్కినెట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(800) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ స్పిన్ దిగ్గజం, దివంగత క్రికెటర్ షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(698), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్(604), గ్లేన్ మెక్‌గ్రాత్(563) నాథన్ లయన్ కన్నా ముందున్నారు. రవిచంద్రన్ అశ్విన్(507) 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో నాథన్ లయన్(4/43) ధాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. గ్లేన్ ఫిలిప్స్(70 బంతుల్లో 13 ఫోర్లతో 71) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మ్యాన్ హెన్రీ(34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(0), రచిన్ రవీంద్ర(0), స్కాట్ కుగ్గెలిజిన్(0) డకౌట్‌గా వెనుదిరిగారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్‌తో పాటు జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసారు.
అంతకుముందు 279/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 115.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(275 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 నాటౌట్) భారీ శతకంతో చెలరేగాడు. జోష్ హజెల్ వుడ్‌తో కలిసి చివరి వికెట్‌కు 106 పరుగులు జోడించాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/70) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
204 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 13 పరుగులే చేసింది. స్మిత్(0), మార్నస్ లబుషఏన్(2) దారుణంగా విఫలమవ్వగా.. ఉస్మాన్ ఖవాజా(5 బ్యాటింగ్), నాథన్ లయన్(6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.