
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అఫ్గాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తెలిపాడు. గాయంతో గత మ్యాచ్‌లకు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడని, దాంతో బౌలర్ షరాఫుద్దీన్ బెంచ్‌కు పరిమితమయ్యాడని చెప్పాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుందామనుకున్నానని చెప్పాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు.
ప్రస్తుత మెగా టోర్నీలో గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరబోయే రెండో బెర్తు ఈ మ్యాచ్‌తో తేలనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా భారత అభిమానులు ఈ మ్యాచ్ ఫలితం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. న్యూజిలాండ్‌పై అఫ్గాన్ గెలిస్తే.. గ్రూప్-2లో మెరుగైన రన్ రేట్ కలిగిన భారత్.. సెమీస్ చేరే అవకాశాలుంటాయి. నాలుగు విజయాలతో పాకిస్థాన్ ఇదివరకే ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరుకోగా.. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, అఫ్గాన్, భారత జట్ల మధ్య పోటీ నెలకొంది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకోనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధిస్తే.. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్తు ఖరారు కానుంది. నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధిస్తే టోర్నీలో ముందడుగు వేసే అవకాశం దక్కుతుంది. దాంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
తుది జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్
అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షెజాద్(వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుల్బదిన్ నయీబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్