టీమిండియా మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటర్లు ఎవరా? అనే ప్రశ్నకు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఆసక్తికర సమాధానం చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల పేర్లు చెప్పకుండా ఐపీఎల్ సూపర్ స్టార్ల పేర్లను సూచించాడు. గత దశాబ్దకాలం పాటు కోహ్లీ, రోహిత్ ప్రపంచ క్రికెట్‌ను శాసించారు.
ఈ ఇద్దరి బ్యాటింగ్ చూసేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి బ్యాటర్ల పేరు చెప్పకుండా బ్రియాన్ లారా.. యశస్వి జైస్వాల్, అభిషఏక్ శర్మల పేర్లు సూచించాడు. ఈ ఇద్దరూ టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్స్ అని చెప్పుకొచ్చాడు. కోహ్లీ, రోహిత్‌లా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తారని కొనియాడాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన ఈ ఇద్దరూ అటాకింగ్ అప్రోచ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించాడు.

'టీమిండియా మోస్ట్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ జైస్వాల్, అభిషేక్ శర్మ. ముందుగా ఈ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లు. అంతేకాకుండా కుర్రాళ్లు. తమదైన శైలిలో అటాకింగ్ అప్రోచ్‌తో సొగసైన బ్యాటింగ్ చేస్తారు. గత రెండేళ్లుగా వారితో నాకు ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనది. తమ బలాలను నమ్ముకొని ఒక్కో అడుగు ముందుకేయడం గొప్ప విషయం.
యశస్వి జైస్వాల్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతనికి ఆ సామర్థ్యం ఉంది. కరేబియన్ పిచ్‌లపై అతను బ్యాటింగ్‌ను చాలా దగ్గరగా చూశాను. ఆస్ట్రేలియా పిచ్‌లు కాస్త భిన్నంగా ఉంటాయి. బలాలను నమ్ముకొని ఆడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించవచ్చు. ఆస్ట్రేలియా గడ్డపై యశస్వి జైస్వాల్ చెలరేగుతాడని ఆశిస్తున్నా.'అని ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నీ ప్రారంభం సందర్బంగా బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు.
భారత టెస్ట్ టీమ్‌లో కీలకంగా మారిన యశస్వి జైస్వాల్.. ఈ ఏడాది ఇప్పటి వరకు 66.35 సగటుతో 929 పరుగులు చేసాడు. ఇందులో రెండు శతకాలతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.