వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్‌సీబీ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. గురువారం వడోదర వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో టైటిల్‌ను ముద్దాడింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
ఈ విజయంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ రికార్డును ఆర్‌సీబీ సమం చేసింది. 2024 సీజన్‌లో ఆర్‌సీబీ తొలి టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజా ఫైనల్లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీ.. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్నిఅందుకున్న జట్టుగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో ఆర్‌సీబీ విజయానికి మంధాన, వాల్ కారణం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ మ్యాచ్‌లో జార్జియో వాల్, స్మృతి మంధాన 165 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసినా.. ఆర్‌సీబీ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది మాత్రం రాధాయాదవ్(5 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్) అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఖరి ఓవర్‌లో రాధా యాదవ్ ఆ రెండు బౌండరీలు కొట్టకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెబుతున్నారు. ఎందుకంటే విజయం ముంగిట సెట్ అయిన వాల్, మంధాన ఔటయ్యారని, బిగ్ హిట్టర్ రిచా ఘోష్ కూడా ఔటైందని, దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిందని గుర్తు చేస్తున్నారు.
చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయని, క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్లు ఫైనల్ ఒత్తిడిలో ఈ పరుగులు చేయడం అంత సులువు కాదని, రాధా యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రెండు బౌండరీలు బాది విజయాన్ని అందించిందని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.