టీ20 ప్రపంచకప్ 2024లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టే సామర్థ్యం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాత్రమే ఉందని టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. విధ్వంసకర ఓపెనర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వరల్డ్ నెంబర్ వన్ టీ20 ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ల కంటే కూడా హార్దిక్ పాండ్యానే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టగలడని అభిప్రాయపడ్డాడు.
అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ టోర్నీలో ఈ సారి 20 జట్లు తలపడుతున్నాయి.అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అప్పటి నుంచి మరే ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్‌ల్లో ఈ ఫీట్ సాధించలేదు.

ఈ క్రమంలోనే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదగల బ్యాటర్ ఎవరనే ప్రశ్నకు యురాజ్ సింగ్.. హార్దిక్ పాండ్యా పేరు చెప్పాడు. ఐసీసీతో మాట్లాడిన ఓ వీడియోలో.. టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన 6 ప్రశ్నలకు యువీ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో మరిచిపోలేని అనుభూతి ఏది అడగ్గా.. కుర్రాళ్లతో టైటిల్ గెలిచిన క్షణమని యువీ సమాధానమిచ్చాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక ప్లేయర్ ఎవరని ప్రశ్నించగా.. సూర్యకుమార్ యాదవ్ అని తెలిపాడు. అతను అసాధారణ ఆటగాడని, ఈ సారి భారత్ విజేతగా నిలవాలంటే సూర్య రాణించడం కీలకమని చెప్పాడు.

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్ సెమీఫైనల్ చేరుతాయని యువీ అంచనా వేసాడు. టీ20 ప్రపంచకప్ ఎందుకు ఇష్టమని అడగ్గా.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినందుకని బదులిచ్చాడు.
యువరాజ్ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నియమించింది. ఇప్పటికే జమైకన్ పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను ప్రచారకర్తలుగా నియమించిన ఐసీసీ.. మూడో బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్‌ను ఎంపిక చేసింది.