టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే అత్యంత డేంజరస్ బ్యాటర్ రిషభ్ పంత్ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
ఈ సిరీస్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకుంటామని చెప్పాడు. మహమ్మద్ షమీ లేకపోవడం టీమిండియాకు తీరని లోటేనని అభిప్రాయపడ్డాడు.

'బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం బాగా సన్నదమవుతున్నాం. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటాం. సొంత అభిమానుల మధ్య ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. గత రెండు పర్యటనల్లో భారత్ విజయం సాధించడంతో ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది.
మా టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టాం. డేవిడ్ వార్నర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. కామెరూన్ గ్రీన్ దూరమవ్వడం మాకు ఎదురుదెబ్బే. ఇక మహమ్మద్ షమీ లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు లోటే. అయితే క్రికెట్‌లో ఆటగాళ్లు గాయాలతో దూరమవ్వడం సాధారణమే.
టీమిండియాలో రోహిత్, కోహ్లీ కంటే రిషభ్ పంత్ ప్రమాదకరమైన ఆటగాడు. గత పర్యటనలో అతను సత్తా చాటాడు. మ్యాచ్‌ను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తాడు. ఈ సారి అతనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాం. రోహిత్, కోహ్లీ ఫామ్‌లో లేకున్నా.. వారిని తక్కువ అంచనా వేయలేం. ఇటీవల భారత ఆటగాళ్లు పేస్ పిచ్‌లపై బాగా ఆడుతున్నారు.
పెర్త్, అడిలైడ్ పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ సారి భారత బ్యాటర్లకు అడ్డుకట్ట వేస్తామని భావిస్తున్నా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ గురించి ఆలోచించడం లేదు. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ ముందుకు సాగుతాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.