టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు కాకుండా ఇతర పేర్లు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఒకరి పేరు కాకుండా ఈ 14 ఏళ్ల కుర్రాడు ఇద్దరు ఆటగాళ్లు తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అని పేర్కొన్నాడు. ఇందులో ఒకరు భారత ఆటగాడు ఉండగా.. మరొకరు విదేశీ ప్లేయర్ ఉన్నాడు.
ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఈ విషయాన్ని వెల్లడించాడు. టోర్నీ నిబంధనల ప్రకారం ప్రతీ ప్లేయర్ తమను తాము పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్, బౌలింగ్ శైలితో పాటు ఫేవరేట్ క్రికెటర్ల పేరు చెప్పాలి. అంతేకాకుండా బ్యాటర్లు అయితే తమ ఫేవరేట్ షాట్, బౌలర్లు అయితే తమ ఫేవరేట్ బాల్ ఏంటో తెలియజేయాలి. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రతీ మ్యాచ్‌లో ప్లే చేస్తుంటారు. బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత బ్యాటర్ల వీడియోలు.. బౌలింగ్ చేస్తున్న బౌలర్ల వీడియోలను చూపిస్తారు.

ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ తన ఫేవరేట్ ప్లేయర్ల పేర్లు వెల్లడించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా తమ ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్లు అని చెప్పుకొచ్చాడు. తనకు పుల్ షాట్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జనవరి 15(గురువారం)న ప్రారంభమైన అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్.. తమ తొలి మ్యాచ్‌ను అమెరికాతో ఆడింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(2) విఫలమైనా.. భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ ఆడిన అతి పిన్న భారత ప్లేయర్‌గా నిలిచాడు.
14 ఏళ్ల 294 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ బరిలోకి దిగాడు. ఈ క్రమంలో కుమార్ కుశాగ్ర రికార్డ్‌ను అధిగమించాడు. అతను 15 ఏళ్ల 88 రోజుల వయసులో అండర్ 19 ప్రపంచకప్ ఆడాడు. 2020లో జరిగిన టోర్నీలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. తాజాగా ఈ రికార్డ్‌ను వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు.