భారత అండర్ 19 సెన్సేషన్, సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ తన రోల్ మోడల్ ఎవరో చెప్పాడు. శుభ్‌మన్ గిల్ తన ఆరాధ్య క్రికెటర్ అని తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్-ఏ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డేలో 6 సిక్స్‌లు, 9 ఫోర్లతో వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేశాడు.
మూడు ఇన్నింగ్స్‌ల్లో వైభవ్.. 59.66 సగటుతో 179 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అండర్ 19 ఆటగాళ్లు ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్.. రెండో రోజు ఆటను చూసేందుకు మైదానానికి వచ్చారు. ఈ సందర్భంగా బీసీసీఐ టీవీతో వైభవ్ సూర్యంశీ మాట్లాడాడు. శుభ్‌మన్ గిల్(269) డబుల్ సెంచరీని ప్రత్యక్షంగా చూడటం సంతోషంగా ఉందని చెప్పాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో నేను చూసిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే. మ్యాచ్ ఎలా సాగుతుందో దగ్గరగా చూశాను. చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ చూసేందుకే మేం అంతా ఇక్కడికి వచ్చాం. మాకు ఎంతో స్ఫూర్తి లభించింది. మాకు శుభ్‌మన్ గిల్ రోల్ మోడల్. దేశం తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ చొరవతోనే భారత అండర్ 19 కుర్రాళ్లకు బర్మింగ్‌హామ్ టెస్ట్ చూసే అవకాశం దక్కిందని భారత జూనియర్ టీమ్ హెడ్ కోచ్ రిషికేష్ కాంతికర్ తెలిపాడు.'వీవీఎస్ లక్ష్మణ్.. కుర్రాళ్లకు సీనియర్ టీమ్ టెస్ట్ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేశాడు. కుర్రాళ్లకు మ్యాచ్ చూపిస్తే బాగుటుందని అతనే చెప్పాడు. కుర్రాళ్లకు ఇది ప్రత్యేకమైన సందర్భం.ప్రతీ బంతిని ఫోర్ లేదా సిక్స్ కొట్టవద్దనే విషయాన్ని ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకున్నారు. శుభ్‌మన్ గిల్ తరహాలో బ్యాటింగ్ చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఈ మ్యాచ్ ద్వారా ఏం నేర్చుకున్నారనే విషయంపై ఓ సెషన్ నిర్వహిస్తాం.'అని రిషికేష్ చెప్పుకొచ్చారు.