టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ హెడ్ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా ఎక్స్‌ఫ్యాక్టర్ హార్దిక్ పాండ్యా అని కొనియాడాడు. అతను టెస్ట్ క్రికెట్ ఆడితే టీమిండియా మరింత పటిష్టం అవుతుందని చెప్పాడు.
భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ 2024లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను.. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించాడు. అయితే ఈ నిర్ణయాన్ని లాల్‌చంద్ రాజ్‌పుత్ సమర్థించాడు.

ధోనీ సారథ్యంలో తొలి టీ20 ప్రపంచకప్ 2007 గెలిచిన భారత జట్టుకు లాల్ చంద్ రాజ్‌పుత్ కోచ్‌గా వ్యవహరించాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తే టీమిండియా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు విభాగాల్లో మరింత పటిష్టం అవుతుందని చెప్పాడు.
'హార్దిక్ పాండ్యా మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడితే చూడాలని ఉంది. అతను మూడు విభాగాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో అతను రాణిస్తే.. టీమిండియాకు తిరుగుండదు. అతను ఓ ఆల్‌రౌండర్. నెంబర్ 6లో వచ్చి బ్యాటింగ్ చేయడంతో పాటు కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు.'అని లాల్‌చంద్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చాడు.
2018లో చివరి సారి టెస్ట్ మ్యాచ్ ఆడిన హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించడం మంచి నిర్ణయమేనని లాల్‌చంద్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేకుంటనే హర్దిక్ పాండ్యా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడగలడని తెలిపాడు.
'కోచ్ నిర్ణయానికి కట్టుబడి సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి ఉంటారు. టీమిండియా మేనేజ్‌మెంట్ హార్దిక్ పాండ్యా నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తే అతను మరింత స్వేచ్చగా ఆడగలడు. బంతి, బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలడు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను నేను విన్నాను. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాడని అతను చెప్పాడు. వారు అన్ని మ్యాచ్‌లు ఆడగలిగే కెప్టెన్ కావాలనుకున్నారు. అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా ఎంచుకున్నారు. కెప్టెన్‌గా అతనికి అపారమైన అనుభవం ఉంది.'అని లాల్‌చంద్ రాజ్‌పుత్ సింగ్ చెప్పుకొచ్చాడు.
సునీల్ గవాస్కర్ సైతం హార్దిక్ పాండ్యా టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇస్తే.. టీమిండియా సునాయసంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుస్తుందన్నాడు.