టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగే అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో నితీష్ రెడ్డి టీమిండియాకు కీలకంగా మారుతాడని జోస్యం చెప్పాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మాయ చేస్తాడని తెలిపాడు. మ్యాజికల్ బాల్స్ వేసే సత్తా అతనికి ఉందని కొనియాడాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టాప్ బ్యాటర్లు విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో సత్తా చాటాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే బౌలింగ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. అయితే అతనికి శార్దూల్ ఠాకూర్ నుంచి పోటీ ఎదురవ్వనుంది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో శార్దూల్ 26.5 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసాడు. తాజాగా భారత సన్నాహకాల గురించి మాట్లాడిన మోర్నీ మోర్కెల్.. నితీష్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించాడు.

'నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభావంతమైన ఆటగాడు. మ్యాజికల్ బాల్స్ వేసే సత్తా అతనికి ఉంది. కాకపోతే అతను తన బౌలింగ్‌లో స్థిరత్వాన్ని పెంచుకోవాలి. దానిపైనే మేము వర్క్ చేస్తున్నాం. ఇది అతని కెరీర్‌కు కూడా చాలా ముఖ్యం. మరింత ఎక్కువగా బౌలింగ్ చేయాలని నితీష్‌కు సూచించాను. బ్యాట్‌తో అతను ఏం చేయగలడో మనందరికీ తెలుసు. కానీ ఇంగ్లండ్ వంటి కండిషన్స్‌లో బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం చాలా అవసరం. నితీష్ బౌలింగ్‌లో రాణిస్తే జట్టుకు కీలక ఆటగాడిగా మారుతాడు. అతని బౌలింగ్ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.'అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
శార్దూల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డిల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే ప్రశ్నకు మోర్నీ మోర్కెల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. పిచ్ కండిషన్స్, ఆటగాళ్ల ఫిట్‌నెస్, టీమ్ కాంబినేషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. 'తుది జట్టు ఎంపిక విషయంలో మేం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటాం. అయితే టెస్ట్ మ్యాచ్‌కు సరిపోయే ఫిట్‌నెస్, సంసిద్దత, ఆ పదును తిరిగి పొందారా? అనే విషయాన్ని పరిశీలిస్తాం. ఎందుకంటే కొంతకాలంగా మేం టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. ఇంగ్లండ్ కండిషన్స్ అనుకూలంగా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతమై ఉండొచ్చు. ఈ కండిషన్స్ మాకు పరీక్షగా నిలుస్తాయి.
ఈ సిరీస్‌కు ఎలా సిద్దం అవ్వాలో జస్‌ప్రీత్ బుమ్రాకు తెలుసు. గత మూడు రోజులుగా బుమ్రా బంతిలో ఉన్న శక్తిని చూసి నేను షాకయ్యాను. బుమ్రా సంతోషంగా ఉండటం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుతానికి అతను ఫిట్‌గా ఉన్నాడు. అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అతని విషయంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తాం. ఎందుకంటే బుమ్రా మాకు అత్యంత కీలకం.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.