న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా మరో విజయాన్ని అందుకుంది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సునాయస విజయాన్నందుకుంది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్), ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76) ఊచకోతతో న్యూజిలాండ్ విధించిన 209 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్న ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే ఇషాన్ కిషర్, సూర్యకుమార్ యాదవ్ కంటే న్యూజిలాండ్ యువ బౌలర్ జాక్ ఫోక్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అతను వేసిన మూడో ఓవర్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని విశ్లేషిస్తున్నారు. జాక్ ఫోక్స్ చేసిన తప్పిదం టీమిండియాకు కలిసొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. అతనే గనుక ఈ ఓవర్‌ను కట్టడిగా వేసుంటే ఫలితం మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.

6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు జాక్ ఫోక్స్ ఊపిరి అందించాడు. అతని పేలవ బౌలింగ్ టీమిండియాపై ఉన్న ఒత్తిడిని తగ్గించింది. మూడో ఓవర్ తొలి బంతిని వేసే క్రమంలో ఫోక్స్ చేతి.. నాన్ స్ట్రైకర్ స్టంప్స్‌ను తాకింది. దాంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఈ నోబాల్‌ను ఇషాన్ కిషన్ బౌండరీ తరలించాడు. నోబాల్‌తో లభించిన ఫ్రీహిట్‌ను అడ్డుకోవాలనే ప్రయత్నంలో జాక్ ఫోక్స్ వరుసగా రెండు వైడ్స్ వేసాడు.
మరుసటి బంతిని ఇషన్ కిషన్ మరో బౌండరీ కొట్టడంతో ఒక లీగల్ డెలవరికి 11 పరుగులు(4nb, wd, wd,4) వచ్చినట్లు అయ్యింది. ఇదే ఓవర్‌లో మరో బౌండరీతో పాటు సిక్స్ బాది ఇషాన్ కిషన్ మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో మూమెంటమ్ మొత్తం భారత్ వైపు మళ్లింది. క్రీజులోకి వచ్చినప్పుడు ఒత్తిడిలో కనిపించిన ఇషాన్ కిషన్.. ఫోక్స్ పుణ్యమా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇతర బౌలర్లపై కూడా విరుచుకుపడి 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే జోరును కొనసాగించి 76 పరుగులతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.