సొంతగడ్డపై తేలిపోతున్న టీమిండియాకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి వన్డేల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గతేడాది టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చిన న్యూజిలాండ్.. ఈ సారి వన్డే సిరీస్‌లో దెబ్బకొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని సరికొత్త చరిత్రను లిఖించింది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్‌ను గెలుచుకొని 38 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
1988లో తొలిసారి వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌కు గత 7 ప్రయత్నాల్లో దక్కని విజయం.. ఈసారి వరించింది. దాంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ అనాలోచిత నిర్ణయాలే టీమిండియాను నాశనం చేస్తున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతను కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే భారత్ ఆధితపత్యానికి గండి పడిందని ఆరోపిస్తున్నారు.
గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోవడం, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ కావడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి, సౌతాఫ్రికా చేతిలో టెస్ట్‌ల్లో క్లీన్ స్వీప్.. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఓటమి వంటి ఘోర పరాజయాలు ఎదురయ్యాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ఓటమికి గంభీర్ కారణం కాదని, బౌలింగ్ వైఫల్యమే విజయవకాశాలను దెబ్బతీసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు అయిన కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాల వైఫల్యం టీమిండియా కొంపముంచిందని గణంకాలతో సహా వివరిస్తున్నారు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయకపోవడంతోనే భారత్‌కు ఓటమి తప్పలేదంటున్నారు.
ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు మూడు మ్యాచ్‌ల్లో కలిపి నాలుగు వికెట్లు మాత్రమే తీసారు. కుల్దీప్ యాదవ్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒకే ఒక్క వికెట్ తీసాడు. అది కూడా రెండో వన్డేలో. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ వికెట్లు ఏమి తీయలేదు. భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్ షాట్లతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ భారత స్పిన్నర్లను చెడుగుడు ఆడాడు.
మరోవైపు అనుభవం లేని న్యూజిలాండ్ స్పిన్నర్లు మాత్రం 6 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ తరఫున ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జేడెన్ లెనాక్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడో వన్డేలో రెండు, రెండో వన్డేలో ఒకటి, తొలి వన్డేలో ఒక వికెట్ తీసాడు. మైఖేల్ బ్రెస్‌వెల్ ఒక వికెట్ పడగొట్టాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపర్చాడు. మూడు వన్డేల్లో అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. జడేజా, కుల్దీప్ యాదవ్ మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఈ సిరీస్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.