గంభీర్, అగార్కర్ కాదు.. ఆ ఇద్దరి వల్లే టీమిండియా భీకరంగా మారింది
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా భీకరంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకోవడం, ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేయడం ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది.
ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ బీభత్సంగా ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబేలతో భీకరమైన బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఒకరు కాకపోతే మరొకరు అన్నట్లు బౌలర్లను చితక్కొడుతున్నారు. ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా బ్యాటింగ్ డెప్త్, ఆటగాళ్ల ప్రతిభపై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఆ ఒక్క నిర్ణయం..
ప్రపంచకప్‌లో భారత్ రెండు జట్లతో బరిలోకి దిగితే ఆ రెండు జట్లు ఫైనల్ చేరుతాయని సునీల్ గవాస్కర్, సైమన్ డౌల్ జోస్యం చెప్పారు. అయితే టీమిండియా ఇంత భీకరంగా మారడానికి ఒకే ఒక్క నిర్ణయం కారణమని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం కాదని, భారత సెలెక్షన్ కమిటీలోకి కొత్తగా చేరిన టీమిండియా మాజీ క్రికెటర్లు ఆర్‌పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాలు తీసుకున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టులో నుంచి తప్పించడం వెనుక ఈ ఇద్దరే ఉన్నారని, ఈ ఒక్క నిర్ణయం భారత జట్టును పూర్తిగా మార్చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శుభ్‌మన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవడం, జితేష్ శర్మ స్థానంలో రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంతో టీమిండియాకు మంచి సమతూకం లభించింది. టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడలేక ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్ గిల్ తప్పించాలనే సోహసోపేత నిర్ణయాన్ని ప్రజ్ఞాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌లు తీసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా విజయాల క్రెడిట్ ఆ ఇద్దరిదేనని కామెంట్ చేస్తున్నారు.
సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు లీక్ ఎలా..?
అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీలోకి ప్రజ్ఙాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌లు కొత్తగా చేరారు. ఎస్ శరత్, సుబ్రతో బెనర్జీల స్థానాలను ఈ ఇద్దరు భర్తీ చేశారు. అయితే సెలెక్షన్ కమిటీలో తీసుకునే నిర్ణయాలు, జరిగే చర్చలు చాలా గోప్యంగా ఉంచుతారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఏ సెలెక్షన్ సభ్యుడు కూడా ఈ వివరాలను బయటకు వెల్లడించకూడదు.
కానీ శుభ్‌మన్ గిల్ వేటు వెనుక ప్రజ్ఞాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌లు ఉన్నారని జోరుగా ప్రచారం జరగడం అందర్నీ విస్మయ పరుస్తోంది. ఆకతాయిలు సృష్టించిందా? లేక ప్రజ్ఞాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌ల పీఆర్ టీమ్స్ ఇచ్చిన లీకులా? అనేదానిపై క్లారిటీ లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌ను ఈ ఇద్దరు నిశితంగా పరిశీలించారు. దాంతోనే ఫ్యాన్స్ ఈ ఇద్దరే ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారని అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications